ప్రాణాలు తీసిన ‘పగ’లు

పెద్దపల్లి : రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్ లోని రామగిరి మండలం ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ దగ్గర ఫిబ్రవరి 17న ఒక దారుణ హత్య జరిగింది. కారులో ప్రయాణిస్తున్న న్యాయవాది గట్టు వామన్ రావు, అతని భార్య నాగమణిని గుర్తుతెలియని దుండగులు నడీరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగుల్లో రోడ్డుపై పడి గిలాగిలా కొట్టుకుని న్యాయవాది గట్టు వామన్ రావు మృతిచెందగా, అతని భార్య నాగమణి కారులోనే తుదిశ్వాస విడిచింది. న్యాయవాద దంపతుల దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరి హత్య వెనుక స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఒకవైపైతే , మరోవైపు న్యాయానికి రక్షణ కరువైతే సామాన్య జనానికి రక్షణ ఎక్కడవుందంటూ సామాన్యుని మొదలుకుంటే మేధావుల వరకు హత్యపై స్పందించారు. హంతకులను కఠినంగా శిక్షించి, న్యాయ వ్యవస్థకే న్యాయం చేయాలంటూ దీనమైన అభ్యర్ధనను చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. అసలు హత్య ఎలా జరిగింది. నిందితులెవరు. హత్య జరగడానికి గల కారణాలేమై ఉంటాయన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు నిజాలు , పగబట్టిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

గుంజపడుగు గ్రామంలోని రామాలయం కమిటీకి సంబంధించిన విషయంలో వివాదం బయటకు వచ్చింది. గుంజపడుగు గ్రామంలోని రామాలయం కమిటీకి సంబంధించిన విషయంలో వెల్ది వసంత రావు తండ్రి అనంతయ్య, గట్టు విజయ్ కుమార్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి తన కుమారుడు వామన్ రావు తన తండ్రి సంతకాన్ని, అతని చిన్న తమ్ముడు ఇంద్ర శేఖర్ రావు సంతకాన్ని తీసుకొన్నారు. తరువాత ఫిర్యాది ఆటోలో తన గ్రామానికి చేరుకున్న తరువాత, తన కుమారుడి డ్రైవర్ నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. అతను తన పేరు సతీష్ అని చెప్పి మరియు కల్వచర్ల గ్రామాన్ని దాటిన తరువాత పెట్రోల్ పంప్ కల్వర్ట్ దగ్గర ప్రధాన రహదారి రోడ్డు వరకు గట్టు వామన్ రావు, నాగమణిలను వేట కొడవలితో అటాక్ చేశారు అని తెలపడం జరిగింది.

గ్రామంలో శ్రీ రామస్వామి మరియు గోపాలస్వామి దేవస్థానాల కోసం కుంట శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అక్కపక కుమార్ మరియు వెల్ది వసంత రావు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ కార్యదర్శి ఇంద్ర శేఖర్ రావును పిలిచి సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనుమతి లేకుండా వారు గ్రామంలో “టామ్ టామ్”(దండోర) వేయించారు. గుంజపడుగు గ్రామానికి చెందిన సర్పంచ్, వామన్ రావు మరియు అతని భార్య నాగమణి కుంట శ్రీను నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయాన్ని అక్రమంగా నిర్మించడం గురించి మరియు కుంట శ్రీను అక్రమ గృహ నిర్మాణం గురించి తెలిపినందుకు మనసులో పెట్టుకొని కుంట శ్రీనివాస్ తో పాటు వెల్డి వసంత రావు, అక్కపక కుమార్ లు తన కుమారుణ్ణి, కోడల్ని చంపారని న్యాయవాది గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు, కోడల్ని దారుణంగా హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కిషన్ రావు పోలీసులకు పిటిషన్ ఇచ్చాడు.

సాయంత్రం 5 గంటలకు గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు రామగిరి ఎస్ఐ ఎ. మహేందర్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ . 21/2021 యూ/ఎస్ 302, 341,120-బీఆర్/డబ్ల్యూ 34 ఐపీఎస్ , ఎఫ్.ఐ.ఆర్ జారీ చేసి, సంబంధిత వారందరికీ కాపీలు పంపడం జరిగింది.

ఇక సీపీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఆరు బృందాలు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తుండగా నిందితులు తెలంగాణ –మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి చంద్రపూర్ ప్రాంతంలో ఉన్నారని పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కుంట శ్రీనివాస్ ఇంకో వ్యక్తితో కలిసి తన బ్రీజా కారులో వెళుతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు గమనించి మంథని ఏరియాలో చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. కుంట శ్రీనివాస్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోదావరిఖని ఏసీపీ ముందు హాజరుపరిచి, విచారణ చేశారు. వీరితో పాటు మూడవ నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురు నిందితులను ఏసీపీ ముందు హాజరుపరిచారు. నిందితులను గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట కిష్టయ్య కొడుకు కుంట శ్రీనివాస్ (44 సం.) , మంథని, విలోచవరంకు వాసి శివందుల రాజం కొడుకు శివందుల చిరంజీవి ( 35 సం.) , మూడవ నిందితుడు గుంజపడుగుకు చెందిన అక్కపాక మాంకయ్య కొడుకు అక్కపాక కుమార్ ( 44 సం.) లుగా ఏసీపీ వెల్లడించారు.

ఇక హత్య ఎలా జరిగింది, నిందితులు పథకం ఎలా వేసుకున్నారో పోలీసులు తెలిపిన ప్రకారం :
17-02-2021 బుధవారం రోజున వామనరావు మంథని కోర్టు వద్దకు వచ్చాడు అని తెలుసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లేటప్పుడు చంపాలని పథకం వేసుకుని కుంట శ్రీను తనకు తోడుగా ఇంకొక వ్యక్తి చిరంజీవిని తీసుకొని తన కారుని అక్కపాక కుమార్ కి బ్యాంకు వద్ద ఇచ్చాడు. వామన్ రావు యొక్క కదలికలు ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని కుంట శ్రీను అక్కపాక కుమార్ కు తెల్పాడు. దీంతో శ్రీను చెప్పిందే తడవుగా అక్కపాక కుమార్, కుంట శ్రీనివాస్ కారు తీసుకోవడం జరిగింది. ఇక కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తన కారును అప్పగించాడు. కారుతో పాటు కుంట శ్రీనుకు రెండు కొబ్బరి బొండంలు కొట్టే కత్తులను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. బిట్టు శ్రీను నుండి కుంట శ్రీను కారు తీసుకోగా ఆ కారును చిరంజీవి డ్రైవింగ్ చేస్తూ ఉంటే కుంట శ్రీను పక్కన కూర్చుని మంథని చౌరస్తాకి రావడం జరిగింది. అదే సమయంలో వామన్ రావు తన భార్య పివి నాగమణితో కలిసి కారు (నెంబర్ టిఎస్ -10-ఇజె -2828)లో బయలుదేరి పెద్దపెల్లి వైపు వెళ్లే సమాచారం ముందుగానే తెలుసుకున్నారు. వారి కంటే ముందే కుంట శ్రీను, చిరంజీవి రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న విషయాన్ని పసిగట్టారు. ఈ ప్రాంతంలో కారు కచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందని ఆ ప్రాంతంలో ముందుగానే వారి రాక కోసం కాపుకాసుకుని ఉన్నారు. కారుని రోడ్డు పక్కన ఆపి వామన్ రావు కారు కోసం వేచిచూస్తున్నారు. అనుకున్నట్లుగానే వామన్ రావు దంపతుల కారు ముందుకు రానే వచ్చింది.

ఇక అనుకున్నదే తడవుగా కుంట శ్రీను తన కారును వామన్ రావు కారుకు అడ్డం తిప్పి, డైవర్ట్ చేశాడు. వేట కొడవళ్లతో వామన్ రావు కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో ఒక్కసారిగా భయపడిన కారు కారు డోరు తీసి భయపడి పారిపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుంట శ్రీను, అతని అనుచరులు కారులోకి చొరబడ్డారు. అప్పటికీ కారులో వెనుకసీట్లో కూర్చున్న వామన్ రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి ప్రయత్నం చేయగా కుంట శీను వామన్ రావుని కారులో నుంచి బయటకు గుంజి కత్తితో అతనిపై దారుణంగా దాడి చేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుండి వచ్చి వామన్ రావు భార్య నాగమణి పై కత్తితో దాడి చేయగా ఆమె గాయాలతో కారు సీట్లోనే తుదిశ్వాస విడిచింది. తర్వాత చిరంజీవి కూడా వామనరావు వద్దకు వచ్చి తాను కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు కొంతమంది వీడియో తీశారు. రోడ్డుపై రక్తపు మడుగుల్లో గిలాగిలా కొట్టుకుంటూ వచ్చీపోయే వారిని, మందలించిన వారిని దాహం అంటూ నీళ్లు అడుగుతూ, అడిగిన వారికి వివరాలు చెబుతూ రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న న్యాయవాది వామన్ రావు చివరిసారి తమపై హత్య చేసిన వారి పేర్లను చెప్పాడు. తమపై దాడి చేసిన వారు గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్ మరియు ఇంకొక వ్యక్తి అని తెలపడం జరిగింది.

దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీను మరియు చిరంజీవి వారు వచ్చిన నల్ల రంగు బ్రీజా కార్ లోనే 8 ఇంక్లైన్ కాలనీ నుండి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లారు. బ్యారేజీ వద్ద ఇద్దరు వామన్ రావు పై దాడి చేసిన సమయంలో ఉన్న బట్టలు మార్చుకుని ఒక బ్యాగ్ లో పెట్టి మరియు దాడికి ఉపయోగించిన కత్తులను రెండింటిని సుందిళ్ల బ్యారేజీ నీటిలో పడేశారు. అక్కడనుండి మహారాష్ట్రకి పారిపోయారు. ఈరోజు మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీసులు టీం కదలికలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగానే అనుమానం వచ్చి మహారాష్ట్ర నుండి ముంబై వెళ్తుండగా వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు పట్టుకోవడం జరిగింది.

న్యాయవాది వామన్‌రావు , కుంట శ్రీనుల మధ్య శత్రుత్వాన్ని రేకెత్తించడానికి మరియు హత్య చేయడానికి గల కారణాలు:
న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకు ప్రధాన ముద్దాయి కుంట శీను. కుంట శ్రీను, వామన్ రావులు ఒకే గ్రామానికి అనగా గుంజపడుగు చెందిన వారైనా ఐదు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. న్యాయవాది వామన్ రావు తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పోలీస్ స్టేషన్లో , కోర్టులో ఇవ్వడంతో తన ఎదుగుదలకు వామనరావు అడ్డు వస్తున్నాడు అని గ్రహించిన కుంట శ్రీను , వామన్ రావుపై పగపెంచుకున్నాడు. అతనిని ఎలాగైనా వదిలించుకోవాలని బలమైన నిర్ణయానికి వచ్చాడు. దీనికి తోడుగా ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాల స్వామి దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదం ,ఇల్లు నిర్మాణం మరియు కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణం ఆగడం కుంట శ్రీను పగకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ నిర్మాణాలను అనవసర లిటిగేషన్స్ పెట్టి ఆపడం వల్ల కుంట శ్రీను తట్టుకోలేని కోపంతో రగిలిపోయాడు. దీనికి తోడు పాత కక్షలు , కొత్త వివాదాలు కలిపి ఎలాగైనా వామనరావు ను అంతమొందించాలని కుట్ర పన్నాడు. కుంట శ్రీను పగకు బిట్టు శీను సహకారం కూడా తోడై ఈ హత్య చేయడానికి త్వరితగతిన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు.

కుంట శ్రీను నేరచరిత్ర :
అనతి కాలంలోనే మండల స్థాయి నాయకుడిగా ఎదిగిన ప్రధాన ముద్దాయికి గతంలో నేర చరిత్ర ఉంది. 1997 సం.లో సికాసలో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడు. బస్సు తగలబెట్టిన కేసులో రిమాండుకు వెళ్ళాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడు. 498a,ఒక ఎక్స్ ట్రాక్షన్ కేసులో కుంట శ్రీను నిందితుడు. ఇక న్యాయవాది దంపతుల హత్య లో కుంట శ్రీనును విచారణ చేయగా ఎక్కడా కూడా రాజకీయ కారణాలు చెప్పలేదు. వారి నుంచి కుంట శ్రీను న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలే హత్య చేసేందుకు ప్రేరేపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దంపతుల హత్యలో ప్రధాన నిందితులు :
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహారాష్ట్ర సరిహద్దులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వివరించారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో ఏ1 గా ప్రధాన నిందితుడు కుంట శ్రీను, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్ ను చేర్చారు. హత్యకు వాడిన వాహనం, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు మరియు ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామని అన్నారు. మిగతా నిందితుల పాత్రపై పూర్తి విచారణ అనంతరం చెబుతామని ఐజీ తెలిపారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరు పాల్గొన్నట్లు తెలిసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు.