కులం పేరుతో యువకుడిపై అమానుషం

చెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించడాన్ని ప్రశ్నించిన ఓ దళిత యువకడిపై నలుగురు దాడి చేసి బాధితుడిపై మూత్రం పోసిన ఉదంతం పుడుకొట్టాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం దళిత యువకుడు, అతని బంధువులు కొందరు చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్ గ్రామానికి చెందిన ప్రదీప్ అటుగా వెళుతూ యువకుడితో ఓ అంశంపై వాదనకు దిగాడు. ఈ వాగ్వివాదం శ్రుతిమించడంతో ప్రదీప్ దళిత యువకుడిని కులం పేరుతో దూషిస్తూ తోసేశాడు. ఆపై ప్రదీప్ మరో ముగ్గురితో కలిసివచ్చి దళిత యువకుడిని కారులో నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడటంతో పాటు అతడిపై మూత్రం పోశారు.

బాధితుడు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదుతో ప్రదీప్ సహా ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.