ఓటమి భయంతోనే ఫోన్ ట్యాపింగ్ లు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పెగాసస్ వ్యవహారంలో ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ లు తోడు దొంగలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతం అయిందని తెలిపారు. ముట్టడి విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడిని టీఆర్ఎస్ ప్రభుత్వం లాఠీఛార్జీలతో అణగదొక్కే ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ads

రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ చేసిన తమ నాయకులను, కార్యకర్తలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు ఇద్దరూ ఒకటేనని మరోసారి స్పష్టం చేశారన్నారు. ఓటమి భయంతోనే కేంద్రం ఫోన్ ట్యాపింగ్ లు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.పెగాసస్ , స్పైవేర్ నిఘాపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణ పూర్తి అయ్యేవరకు హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం పాత్రపై విచారణ చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులు బయట పడేవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు తప్పవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ కు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిరసన సభ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు అక్కడి నుంచి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేసినప్పటికీ, దశల వారీగా రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం కనిపించింది. అయినప్పటికీ పోలీసులు కాంగ్రెస్ నేతలను కట్టడి చేయడమే లక్ష్యంగా పలువురిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు.