వాయిదా పడిన జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఐఐటీ , ఎన్ ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని , పరీక్ష తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని వెల్లడించింది.

ads

షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్ష ఈనెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉన్నది. ఇప్పటికే మొదటి రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తయ్యాయి. మూడోదైన ఏప్రిల్ సెషన్ కరోనాతో వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అదే విధంగా సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. దీంతో జేఈఈ మెయిన్ ను కూడా పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా పరీక్షను వాయిదా వేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకున్నది.