చేనేత కళను కాపాడుకోవాలి: పూనం

వరంగల్ అర్బన్ జిల్లా: వరంగల్ అర్బన్ జిల్లా : కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని సినీ నటి పూనమ్ కౌర్ స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కొత్త‎వాడలో చేనేత కార్మికుల స్థితిగతులను ఆమె అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొత్తవాడ దర్రీలను, చేనేత కార్మికుల కులవృత్తిని కాపాడాలని ప్రభుత్వానికి విన్నవిస్తానని ఆమె తెలిపారు.

చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతీ ఒక్కరూ చేనేత దర్రీల (జంప్‎ఖానాలు )ను కొనుగోలు చేయాలని ఆమె కోరారు. చేనేత కార్మికులను కార్మికులుగా కాకుండా కళాకారులుగా పిలవడమే బాగుందని ఆమె కొనియాడారు. అంతకు ముందుగా వరంగల్, కొత్తవాడలో చేనేత కళాకారులు దర్రీలపై రూపొందించిన మహాత్మాగాంధీ, రుద్రమదేవి చిత్రాలను చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు.

చేనేత కళాకారుడు వీరబత్తిని రమేష్ నేసిన మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన దర్రీని ఆమె కొనుగోలు చేశారు. పూనం కౌర్ తో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ చేనేత విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చిప్ప వేంకటేశ్వర్లు ఉన్నారు.