పక్కాగా వేరుశెనగ విత్తనాల పంపిణీ జరగాలి

* వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి..
* కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలి
* టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే చెవిరెడ్డితిరుపతి : వేరుశెనగ విత్తనాలు చంద్రగిరి నియోజకవర్గ రైతులకు పక్కాగా అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు రైతులు వినియోగించుకునేలా చూడాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి కోరారు. రైతులు కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఎరువులను సైతం వినియోగించుకోవాలని తెలియజేశారు. వేరుశెనగ పంటలో వ్యవసాయ అధికారుల సూచనలు పొంది అధిక దిగుబడి పొందాలన్నారు. పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్ పరిధిలో 1,378 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేసినట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం 5,700 ఎకరాల భూమిని వేరుశెనగ పంటకు వినియోగించనున్నట్లు వివరించారు. అనంతరం ఆర్సీ పురం, చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో వేరుశెనగ విత్తనాల పంపిణీ వివరాలను తెలియజేశారు.

ads

కరోనా బాధితులకు ఆయా మండలాల పరిధిలో అధికారులు నిరంతరంగా పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందేలా వాకబు చేయాలన్నారు. ఆసుపత్రులలో ఉంటే ఆ ఆసుపత్రులలో సమాచారం తెలుసుకోవలన్నారు. అలాగే హోం ఐసోలేషన్ లో, కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న వారికి ఎటువంటి లోటు రానేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా కేసులు నియోజకవర్గంలో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ లో 220 మంది మాత్రమే కరోనా బాధితులు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో కరోనా కేసుల కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.