వరవరరావుకు తాత్కాలిక బెయిల్

ముంబై: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ( 81)కు బాంబే హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు 6నెలల పాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీష్ పిటాలేల ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది.
2018, ఆగస్టు 28న ఎల్గార్ పరిషత్ – భీమా కోరెగావ్ కేసులో అరెస్టయిన వరవరరావు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన బాంబే హౌకోర్టులో పిటిషన్ వేశారు. అయితే వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం , ఈ 6 నెలల కాలంలో ఆయన ముంబై నగరాన్ని వీడి బయటికి వెళ్లరాదని ఆదేశించింది.

అదేవిధంగా కేసు విచారణకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయరాదని, కేసులో సహనిందితులుగా ఉన్నవారితో మాట్లాడవద్దని సూచించింది. ఒకవేళ 6నెలల తర్వాత ఆరోగ్యం మెరుగుపడకపోతే బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోర్టు పేర్కొన్నది.