మొక్కల సంరక్షణపై దృష్టిపెట్టాలి

హైదరాబాద్: సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్ఠిపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా పనులపై హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయాశాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రీన్ ఇండిమా చాలెంజ్, కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించే బాధ్యత సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీచైర్మన్లు తీసుకోవాలని ఈ సమీక్షలో మంత్రి సూచించారు. అదేవిధంగా ప్రగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి ఇంకా ఏఏ పోస్టులు మిగిలి ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆయన సూచించారు. రైతు వేదికల్లో కేవలం ఇంకా 9 మాత్రమే పూర్తి కావాల్సి ఉందని వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, తీసుకురావాల్సిన నిధులు, పనుల కోసం కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ అనుసంధాన పనులు కొనసాగాలి, వాటి
అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

పల్లెల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా కొనసాగాలి. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు అదుపులో ఉంటాయి. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, కల్లాల నిర్మాణం పూర్తి కావాలి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా అధికారులు చూడాలి అని మంత్రి చెప్పారు.