మోడీ తల్లికి లేఖ రాసిన రైతు

న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలు మార్లు రైతులతో కేంద్రం చర్చలకు దిగినా, నిరంతర నిరసన చేస్తున్నా ప్రధానీ మోడీ స్పందించకపోవడంపై పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాకు చెందిన హర్ ప్రీత్ సింగ్ అనే రైతు భావోద్వేగానికి గురయ్యాడు. భావోద్వేగానికి గురైన బా‎ధిత రైతు ప్రధాని నరేంద్ర మోడీ తల్లికి ఓ లేఖ రాశాడు. ఆ చట్టాలను రద్దు చేసేలా మీ అబ్బాయి మనసు మార్చండి అంటూ ఆ లేఖలో రైతు కోరారు. ఓ తల్లిగా తనకున్న అధికారాలన్నింటినీ ఉపయోగించుకుని మోడీ మనసు మార్చుతారని ఆశిస్తున్నా అని రైతు చెప్పడం గమనార్షం.

మోదీ తల్లి హీరాబెన్ కు రాసిన లేఖలో ఈ చట్టాలను ఎందుకు రద్దు చేయాలో ఆ రైతు వివరించారు. తాము ఎలాంటి వాతావరణంలో ఆందోళన నిర్వహిస్తున్నామో చెప్పారు. చాలా బరువైన మనసుతో ఈ లేఖ రాస్తున్నాను. కడుపు నింపే అన్నదాతను ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ రోడ్లపై పడుకునేలా చేస్తున్నారు. ఈ ఆందోళనలో 90-95 ఏళ్ళ వయసు వాళ్లు కూడా ఉన్నారు. పిల్లలు , మహిళలు ఉన్నారు. ఇప్పటికే కొంతమంది చనిపోయారు. అదానీ, అంబానీ, కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ చట్టాలను రూపొందించారు అని ఆ రైతు లేఖలో వివరించారు. ఎన్నో ఆశలతో ఈ లేఖ రాస్తున్నాను. మీ అబ్బాయి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని, ఆయన ఈ చట్టాలను రద్దు చేయగలరు, నాకు తెలిసి ఎవరూ తల్లి మాటను కాదనరు అని ఆ రైతు లేఖలో రాశారు. ఓ తల్లే తన కొడుకును ఆదేశించగలదని, ఆ పని చేస్తే దేశం మొత్తం మీకు ధన్యవాదాలు చెబుతుంది అని రైతు హర్ ప్రీత్ స్పష్టం చేశారు.