ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు

హైదరాబాద్​ : రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీరును అందజేస్తుందని అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శుక్రవారం “ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో శిల్ప కళావేదికలో జరుగుతున్న రెండు రోజుల “53వ వార్షిక సమావేశం2021” ను స్పీకర్​ ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రాష్ట్రం తరుపున ఘన స్వాగతం అన్నారు. సమస్త జీవరాశికి జలం జీవనం అన్నారు. మనిషికి పరిశుభ్రమైన త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి, బలమైన ఆహారం అవసరం. వర్షం నీరు మాత్రమే స్వచ్ఛమైన మంచినీరు. అందుకే వర్షాల ద్వారా కురిసిన నీటిని నదుల నుంచి సేకరిస్తున్నారు. వాటిని శుద్ధి చేసి అందించడానికి తాగునీటి పథకాలను నిర్మిస్తున్నారని స్పీకర్​ పోచారం తెలిపారు.

ads

రాష్ట్ర ప్రభుత్వం నలభైవేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ద్వారా ఉపరితల నీటిని సేకరించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. ఇంత పెద్ద పథకం విజయంతమైందంటే దానికి ఇంజనీర్ల కృషి, పట్టుదలే కారణమని స్పీకర్​ అభినందించారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తాయి. కానీ పథకాల నిర్మాణంలో విజయం మాత్రం ఇంజనీర్లదేనని స్పీకర్​ ప్రశంసించారు.

నీటి ప్రాముఖ్యత, సంరక్షణలో ఇజ్రాయిల్ దేశం ఆదర్శం. తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయిల్ దేశం పునఃశుద్ధి ప్రక్రియ ద్వారా నీటి వనరులను పొదుపుగా వాడుకుంటుందన్నారు. మన దేశంలోని అన్ని నదుల ద్వారా ఏటా డెబ్బై వేల టీఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటిని సక్రమంగా వినియోగించుకోగలితే తాగు, సాగునీటికి ఢోకా ఉండదని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.

ఎండాకాలం వచ్చిందంటే గతంలో తాగునీటి కోసం ధర్నాలు, ఆందోళనలు జరిగేవి. కానీ నేడు ప్రభుత్వాలు ఇంజినీర్ల సహకారంతో నిర్మిస్తున్న తాగునీటి పథకాల ద్వారా ప్రజలకు మంచినీరు అందుతుందని చెప్పారు. దీనికంతటికి ఇంజినీర్ల ప్రతిభే కారణమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి చెప్పారు.

సమావేశంలో హైదరాబాద్ జలమండలి ఎండీ దానకిశోర్ ఐఏఎస్​, ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్​ యం. సత్యనారాయణ, కొండారెడ్డి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.