24 న పీవీ స్మారక పురస్కారాలు

హైదరాబాద్​ : పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 28 వ వార్షికోత్సవ వేడుకలు రేపు ఆదివారం సాయంత్రం 5.30 కు జరుగనున్నాయి. హైదరాబాద్​ చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దివిలో విద్వత్ సభలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా సాహితీ సౌజన్యులకు పీవీ స్మారక పురస్కారాలు అందచేస్తున్నట్లు సర్వార్థ సంక్షేమ సమితి చైర్మన్​ పీవీ మనోహర్ రావు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచార్య అధ్యక్షతన జరిగే సమావేశంలో మానవ హక్కుల సంఘం ట్రిబ్యునల్ చైర్మన్​ జస్టిస్ జీ చంద్రయ్య, శాసన మండలి మాజీ చైర్మన్​ డాక్టర్​ ఎ. చక్రపాణి, ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్​ మండలి‌ బుద్ద ప్రసాద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ద్విసహస్రావధాని డాక్టర్​ మాడుగుల నాగఫణి శర్మ, డాక్టర్​ శ్రీ రంగాచార్య పాల్గొంటున్నారని రావు తెలిపారు. ఈ సందర్భంగా “సమర్పణం” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత ఇరవై ఏళ్ల నుంచి మహామహులకు తమ సంస్థ సత్కారాలు అందించిందని పీవీ మనోహర్ రావు పేర్కొన్నారు.