పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ ఆవిష్కరణ

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక డిజైన్ లను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజుతో కలిసి హైదరాబాద్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు సుమారు రూ.11 కోట్లు ప్రతిపాదనలతో పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ ను రూపొందించినట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పీవీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మృతివనం లాగా పీవీ విజ్ఞాన వేదికను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ గర్వించేలా పట్వారీ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన పీవీ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి ప్రధాత అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ప్రధానిగా పీవీ అమలు చేసిన సంస్కరణలు, పాలనా అధ్యక్షత భవిష్యత్ తరాలకు తెలిసేలా వంగర గ్రామంలో మ్యూజియం , సుమారు 8 ఎకరాల్లో పీవీ విజ్ఞాన వేదిక నిర్మిస్తున్నట్లు తెలిపారు.

జీవో ఆర్‎టి నెంబర్ 22 ప్రకారం మొదటి విడుతగా రూ.7 కోట్లతో విజ్ఞాన వేదికలో పీవీ విగ్రహాన్ని ఫౌంటైన్, లైటింగ్, ఫోటో గ్యాలరీ, యోగా కేంద్రం, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డెన్, ఆటస్థలాలు, స్వాతంత్ర్య సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పనుల నిర్వహణకు ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్థ ఎండి మనోహర్, టూరిజం అధికారులు రామకృష్ణ, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.