ఆరంభ రౌండ్లోనే ఓటమి

బ్యాంకాక్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆశించినమేర విజయం సాధించలేకపోతుంది. సుధీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన పీవీ సింధు ఆశించనమేర రాణించలేకపోతోంది. థాయ్ లాండ్ ఓపెన్ సూపర్-1000 తో తొలి అంతర్జాతీయ టోర్నీలో పోటీపడ్డ ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఎన్నో అంచనాలతో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో బరిలోకి దిగిన ఆరో సీడ్ సింధు ఆరంభ రౌండ్లోనే ఓటమిపాలైంది.

మహిళల సింగిల్స్ గ్రూప్ -బిలో సింధుకు తొలి రౌండ్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. మెరుగైన ప్రదర్శనే చేసిన సింధు 21-19, 12-21, 17-21 తో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ ( చైనీస్ తైపీ ) చేతిలో పరాజయం పాలైంది. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్ ను కైవసం చేసుకున్న సింధు తర్వాతి రెండు గేమ్స్ లో ప్రత్యర్థి ధాటికి నిలువలేకపోయింది.

ఇప్పటి వరకు తై జు యింగ్ తో 21 సార్లు తలపడిన సింధు 16 సార్లు ఓడిపోయింది. గ్రూప్ -బిలో సిధు తన తర్వాతి మ్యాచ్ లో స్థానిక క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్ ( థాయ్ లాండ్ )తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవలి థాయ్ లాండ్ టోర్నీలో సింధును రచనోక్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.