టీ20 ఓపెనర్లుగా రాహుల్, రోహిత్

 

ads

అహ్మదాబాద్ : అహ్మదాబాద్‎లో ఇంగ్లండ్ తో జరుగనున్న తొలి టీ20లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వస్తారని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధ్రువీకరించారు. రేపు తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఆదివారం 14న రెండో టీ20, మంగళవారం 16న మూడో టీ20 మ్యాచ్, 18, 20న నాలుగు, ఐదో టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. రోహిత్ శర్మ హాట్ ఫాంలో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 4 మ్యాచుల్లో 345 పరుగులు చేసి 57.50 సగటుతో భారత్ అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడుగా నిలిచాడు. మరోవైపు రాహుల్, గత ఏడాది డిసెంబర్ లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ నుంచి భారత్ తరపున పాల్గొనలేదు.

రేపటి మ్యాచ్ లో శిఖర్ ధావన్ మూడో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రానున్నాడు. ‘ రోహిత్ ఆడితే మాకు గెలవడం చాలా సులభం. రాహుల్, రోహిత్ మాకు నిలకడగా రాణించారు. వారిలో ఎవరైనా విశ్రాంతి తీసుకుంటే, శిఖర్ 3వ ఓపెనర్ గా వస్తాడు. రోహిత్, రాహుల్ ఇంగ్లండ్ తో టీ 20 మ్యాచులో ఓపెనర్లుగా వస్తారు ‘ అని విరాట్ కోహ్లీ తెలిపారు. మ్యాచ్ కు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడారు. రాబోయే టీ 20 లల్లో టీం ఇండియా ఇంగ్లండ్ పై “ఫ్రీ క్రికెట్ ” ఆడాలని చూస్తుందని కోహ్లీ చెప్పారు.

ఇప్పుడు టీం ఇండియాలో భారీగా ఆడే బ్యాట్స్ మెన్ ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ఆటగాళ్లు మరింత స్వేచ‌్ఛగా బ్యాటింగ్ చేయడాన్ని చూస్తారన్నారు. ఈ సిరీస్ నుంచి మా విధానంతో మేం మరింత స్వేచ్ఛగా ఉండటం చూస్తున్నాను అని కోహ్లీ చెప్పారు. ఈ యేడాది భారత్ లో జరిగే టీ 20 వరల్డ్ కప్ ను అందుకోవడానికి ఇంగ్లండ్ ఫేవరేట్ గా ఉంటుందని కోహ్లీ పేర్కొన్నారు. వారు ప్రపంచంలోనే నెంబర్ 1 జట్టుగా ఉన్నారని, అందుకే వారే ఫేవరేట్స్ అని కోహ్లీ చెప్పారు. భారత్, ఇంగ్లండ్ మధ్య మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు అహ్మదాబాద్ లో 3 వన్డేలు మార్చి 23 నుంచి పుణేలో ఆడనున్నాయి.