మరో వివాదంలో నటి శిల్పాశెట్టి భర్త

ముంబయి : ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తెరమీదకి వస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన అశ్లీల చిత్రాల కేసులో ఆయన అరెస్ట్ కావడం సంచలనం రేకెత్తిస్తోంది. జేఎల్ స్ట్రీమ్ యాప్ యజమాని ఐన రాజ్ కుంద్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీం రాజస్థాన్ రాయల్స్ కు సహ యజమాని. 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజ్ కుంద్రాను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సుమారు 2వేల కోట్ల బిట్ కాయిన్ కుంభంకోణంపై కేసులో సైతం రాజ్ కుంద్రాను ఈడీ అధికారులు విచారించారు.

ads

ఇప్పుడు తాజాగా అశ్లీల చిత్రాల చిత్రీకరణతో రాజ్ కుంద్రా ఇరికిపోయారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణతో పాటు వాటి డిస్ట్రిబ్యూషన్ లో కూడా రాజ్ కుంద్రా పాత్ర ఉందని ముంబయి పోలీసులు పక్కా ఆధారాలతో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్ ల ద్వారా వాటిని రిలీజ్ చేయడంపై ఫిబ్రవరిలో ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టి భర్తపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రాపై పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని ముంబయి పోలీసు కమిషనర్ తెలిపారు.

హీరో హీరోయిన్లను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్ మొబైల్ యాప్స్ కు అమ్మడం బిజినెస్ గా పెట్టుకుని కోట్లు గడిస్తున్న రాజ్ కుంద్రా అసలు స్వరూపం బయటపడింది. ఈ కేసు లో రాజ్ కుంద్రాతో పాటు పెయిడ్ మొబైల్ యాప్స్ కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ముంబయి పోలీసు కమిషనర్ వెల్లడించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్ కుంద్రా చెప్పడం గమనార్హం. బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నాడు.