మార్చి 8కి రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ మార్చి 8వ తేదీకి వాయిదాపడింది. బడ్జెట్‎పై చర్చ పూర్తి కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అనంతరం సభను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వాస్తవానికి పార్లమెంట్ తొలి విడుత సమావేశాలు ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 14న ఆదివారం కావడంతో 13న తొలి విడుత ముగించాలని నిర్ణయించారు. తాజాగా మరో రోజు ముందుకు జరిపి ఫిబ్రవరి 12న రాజ్యసభ తొలి విడుదతకు ముగింపు పలికారు. దీంతో రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల మొదటి విడుత ముగిసినట్లయ్యింది. రెండో విడుత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి.

కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయ్యాయి. 29న పార్లమెంట్ ఉభయసభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగించిన తర్వాత ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఆ తీర్మానానికి ప్రధాని మోడీ సమాధానం ఇచ్చిన అనంతరం తాజా బడ్జెట్‎పై జనరల్ డిస్కషన్ జరిగింది. ఇవాళ రాజ్యసభలో బడ్జెట్‎పై చర్చ ముగియగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు సమాధానం ఇచ్చారు.

అయితే రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కానీ, లోక్‎సభలో వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల నిరసనలతో ఎలాంటి బిల్లులు ఆమోదం పొందలేదు.