18న దేశవ్యాప్త రైల్ రోకో

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసన తీవ్రతరమవుతోంది. తమ డిమాండ్లకు మద్దతుగా ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్ రోకోను చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయత్ బుధవారం వెల్లడించారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు రైలు రోకో ఆందోళనను తమ ప్రాంతాల్లో నిర్వహిస్తారని చెప్పారు.

మరోవైపు రైతులు రైలు రోకో ఆందోళన తలపెట్టడంతో ప్రధానంగా పంజాబ్ , హర్యానా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ లో ముందు జాగ్రత్తగా రైల్వేలు 20 అదనపు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కంపెనీలను రప్పించాయి. రైలు రోకో నేపథ్యంలో నిరసనకారులు సంయమనంతో వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆందోళనను పురస్కరించుకుని తాము జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తామని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉండేందుకు అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.