ఐపీఎల్-2025 ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ
వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : ఎట్టకేలకు విరాట్ కోహ్లీ కల నెరవేరింది. 18 యేళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి, తొలి ట్రోఫీని చేజిక్కించుకుంది. మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిల్ కోసం పోరాడాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.
ఫైనల్ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. ఒకసారి ఆర్సీబీ, మరొకసారి పంజాబ్ రేసులోకి వచ్చాయి. ఫైనల్ గా విజయం ఆర్సీబీనే వరించింది. గెలుపుకు 3 బంతులు మిగిలి వుండగానే విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియం మొత్తం ఆర్సీబీ…ఆర్సీబీ అనే నినాదాలతో మార్మోగింది. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన మాజీ క్రికెటర్లు ఏబీ డివిలర్స్, క్రిస్ గేల్ లు ఆర్సీబీ గెలుపు అనంతరం గ్రౌండ్ లో విరాట్ కోహ్లీని హత్తుకుని కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం కోహ్లీ శర్మ తన భార్య అనుష్కశర్మను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి టైటిల్ కోసం ఆర్సీబీ అలుపెరగని పోరాటం చేసింది. చివరికి లక్ష్యాన్ని సాధించింది. ఫైనల్ లో టీం వర్క్ తో విక్టరీ కొట్టింది. 17 సీజన్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ ప్రయత్నంలో సొంతం చేసుకుంది. మూడుసార్లు చివరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ , ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో స్టేడియం మొత్తం తారాజువ్వలతో విరజిల్లింది. అభిమానుల కేరింతలతో మార్మోగింది. మొత్తానికి ఈ గెలుపు ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంది.