రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్..మరో సోనూసూద్

హైదరాబాద్‌ : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్. ఈ కరోనా కష్టకాలంలో తన ‘ఆజాద్ ఫౌండేషన్’ద్వారా ఎందరికో సహాయాన్ని అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా.. తనకు చేతనైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ట్యాబ్‌లెట్స్, ఇంజక్షన్స్, ఫుడ్, నిత్యావసర సరుకులు.. ఇలా ఎవరికి ఏ అవసరం ఉంటే.. ఆ అవసరం తీర్చుతూ.. దాదాపు 1400 కుటుంబాలను ఆయన ఈ కష్టకాలంలో ఆదుకున్నారు. అలాగే వందల మందికి కరోనా ఆయుర్వేద మందును అందజేశారు. ఆయన సాయం అందుకున్న వారంతా.. ఆయనని ‘మరో సోనూసూద్’అంటూ పిలుస్తుండటం విశేషం. జూన్ 5 అఫ్సర్ ఆజాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి శక్తి మరింతగా లభించాలని కోరుతూ.. ఆయన నుంచి సాయం అందుకున్న వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ads

ఎలాంటి శిక్షణ, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ్‌, భోజ్‌పురి సినిమాలలో హీరోగానూ ఆయన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా ఈ రియల్ స్టార్‌లోని ఒక కోణం అయితే.. సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతో ఆయన ఆజాద్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆజాద్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రత్యేకంగా అఫ్సర్ ఆజాద్‌ని అభినందించారు. కాగా.. సరైనోడు, భలేభలే మగాడివోయ్, రుద్ర ఐపీఎస్ వంటి చిత్రాలలో ఆయన ప్రముఖ పాత్రలలో నటించారు.