రాత పరీక్షతోనే ప్రొఫెసర్ల భర్తీ

టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం
యూనివర్సిటీల్లోనే ఇంటర్వ్యూలు
సాధాసాధ్యాలపై నేడు నిర్ణయం
1,061 పోస్టుల భర్తీకి అనుమతి

ads

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు ఏ వర్సిటీలో ఖాళీలను ఆ వర్సిటీయే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తూ వస్తున్నాయి. ఇలా కాకుండా అన్ని వర్సిటీల్లో ఖాళీలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను టీఎస్పీఎస్సీకి, ఇంటర్ల్యూల నిర్వహణ బాధ్యతలను ఆయా వర్సిటీలకు అప్పగించే అవకాశం ఉన్నది. ఈ విధానం సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉన్నత విద్యామండలి, అన్ని వర్సిటీల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఈపోస్లుల భర్తీపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలోని 11 ప్రభుత్వ యూనివర్సిటీల్లో 1,061 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి భర్తీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు , జాప్యానికి తావులేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. గతంలోలాగా కాకుండా రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్ల్యూలు నిర్వహిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడం హర్షణీయం. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీతో వర్సిటీలన్నీ బలోపేతమవుతాయి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం మంచిదే. న్యాయపరమైన చిక్కులకు తావులేకుండా, సమస్యలు తలెత్తకుండా నియామకాలు పకడ్భందీగా చేపట్టాలి.

రాగి మల్లికార్జున్ రెడ్డి, చైర్మన్, ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్.