అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రోడ్ షోలు

గ్రేటర్ వరంగల్ : తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, నేతలు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో ప్రచార హోరును కొనసాగించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబులు రోడ్ షో నిర్వహించి ఆయా డివిజన్లలో ప్రచారాన్ని నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 7వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ కు మద్దతుగా 7వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించి, తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ads

ఈ రోడ్ షోలో 7వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ తో పాటు, పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు చెన్నం మధు, చీకటి శారద, నలబాలు సరళ, సిరాజుద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు.