మళ్లీ పల్లా రాజేశ్వర్ రెడ్డిదే గెలుపు

హైదరాబాద్ : వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా 12,806 ఓట్ల మెజార్టీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అందించారు.

ads

ఆధిక్యానికి సంబంధించి తుది లెక్కలు ఆదివారం రాత్రి వెల్లడించనున్నారు. శనివారం రాత్రి సమయానికి 55వ రౌండ్ తర్వాత ప్రధాన అభ్యర్థుల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి (టీఆర్ఎస్ )1,11,190 , తీన్మార్ మల్లన్నకు ( స్వతంత్ర) 83,629, ప్రొఫెసర్ కోదండరాంకు (తెలంగాణ జన సమితి) 70,472, ప్రేమేందర్ రెడ్డి ( బీజేపీ ) 39,268 ఓట్లతో ఉన్నారు. రాముల్ నాయక్ ( కాంగ్రెస్ ) 27,713, జయసారథి (వామపక్ష) 9,657, చెరుకు సుధాకర్ 8,732, రాణి రుద్రమ ( యువ తెలంగాణ పార్టీ )7903 ఓట్లు సాధించారు.

తొలి ప్రాధాన్యత ఓట్లలో ప్రతీ రౌండ్ లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించి తదుపరి ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థికి విజయం కట్టబెట్టారు. వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి వరించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.