రోడ్డు భద్రత అందరి బాధ్యత

హైదరాబాద్​ : రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్​బీనగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నందు రాచకొండ సీపీ ఎంఎం భగవత్ ఆధ్వర్యంలో రోడ్డు​ అండ్​ ట్రాఫిక్​ అవేర్​నెస్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హోం మంత్రి మహమూద్​ అలీ, డీజీపీ మహేందర్​రెడ్డి హాజరయ్యారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.

‘డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై మర్డర్ కేసులు నమోదు చేసేలా చట్టంలో మార్పు రావాలి. ఆర్టీసీలో సుశిక్షితులైన డ్రైవర్ లు ఉన్నారు అందుకే ప్రమాదాలు చాలా తక్కువ స్థాయిలో చోటు చేసుకుంటాయి అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. నిబంధనలు పాటి స్తే ప్రమాదాలు తగ్గుతాయని మంత్రి చెప్పారు. రూల్స్ పాటించని వారిని ఉపేక్షించొద్దన్నారు. సిరిసిల్లలో త్వరలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ని ఏర్పాటు చేయబోతున్నాం అని మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వాహనాలు హై స్పీడ్ వెహికల్స్ అందుబాటులోకి వస్తున్నాయి కానీ వారికి తర్ఫీదు ఇచ్చేవారు లేరని మంత్రి పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై కచ్చితంగా స్పీడ్ లిమిట్ సూచికలను ఏర్పాటు చేయాలి. స్పీడ్ గన్ లు ఉన్నాయని తెలియజేసే సూచికలను కూడా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహరించాలని కోరారు.
రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు అవసరమని వాటిని నిర్లక్ష్యం చేస్తే మనతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా తీసిన వారమవుతామన్నారు మంత్రి. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యపర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తుస్తోందని మంత్రి పువ్వాడ వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న తనం నుంచే ట్రాఫిక్ పై అవగాహన కల్పించాలని కోరారు. ఇతరులకు అవగాహన కల్పిస్తూ మనం కూడా పాటించాలన్నారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమన్నారు.

ప్రమాదాలను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ లిమిట్ డిజిటల్ డిస్ ప్లే బోర్డును అనుసరించి వాహనాలు నడపాలన్నారు. వాహనదారులు స్పీడ్ లిమిట్ దాటడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. స్పీడ్ లిమిట్ దాటితే స్పీడ్​ మీటర్ ద్వారా ఆ వాహన యజమానికి చలాన్ మెసేజ్ వెళ్తుందన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి’ అని మంత్రి పువ్వాడ సూచించారు.

‘రాష్ట్ర ప్రభుత్వం రవాణా వ్యవస్థ కు పెద్ద పీట వేసింది. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనంగా అలవెన్స్ ప్రభుత్వం అందిస్తోందని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. టెక్నాలజీని వాడుకోవడంలో తెలంగాణ పోలీస్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో నంబర్​వన్​ ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారని మంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు.

సినీ నటుడు హరికృష్ణ కూడా ఓవర్ స్పీడ్ తో డివైడర్​ని ఢీకొట్టి చనిపోయాడని తెలిపారు. మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి మహమూద్​ వివరించారు. పోలీసులు చలాన్లు విధించడమే లక్ష్యంగా పెట్టుకోరు. నిబంధనలు పాటించని వారిపై చలాన్లు వేస్తారని సూచించారు. హెల్మెట్లు కచ్చితంగా పెట్టుకోవాలి అది వారి రక్షణ కోసమే’ అని హోం మంత్రి మహమూద్​ అలీ సూచించారు.

‘ రోడ్డు ప్రమాదాలతో ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి సేఫ్ గా తిరిగి రావాలి అంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత లో భాగస్వామ్యం అవ్వాలి అన్నారు డీజీపీ మహేందర్​రెడ్డి. డ్రండ్​ అండ్ డ్రైవ్ చేసే వారి పై భారీ జరిమానాలు విధించడమే కాకుండా ఐపీసీ 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేస్తున్నాం. బ్లాక్ స్పాట్స్‌ ను గుర్తించి అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం’ చెప్పారు డీజీపీ మహేందర్​రెడ్డి.

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఎంఆర్​ఎం రావు ,జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.