సాగర్ లో కారు జోరు..

నల్గొండ జిల్లా : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాల్లో కారు జోరుమీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి అడ్రస్ గల్లంతైంది. ప్రతీ రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 13వ రౌండ్ ముగిసే సరికి 10,581 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.

ads

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,854, కాంగ్రెస్ కు 3113 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 3,421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. ఇలా రౌండ్ రౌండ్ కి టీఆర్ఎస్ మొదటిస్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ మూడో స్థానంలో ఓట్లు కైవసం చేసుకుంటుంది. ఇలా 13వ రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు, కాంగ్రెస్ కు 3546 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో 7 టేబుళ‌్ళ చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం 7 గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెండ్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్ లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.