భారీగా తగ్గిన ఫోన్ల అమ్మకాలు

హైదరాబాద్: అంతర్జాతీయంగా 2020లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 12.5శాతం మేర తగ్గిపోయినట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ గార్ట్ నర్ వెల్లడించింది. 2020 చివరి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ 5.4 శాతం మేర తగ్గినట్లు కూడా ఈ రిపోర్ట్ తెలిపింది. గతేడాది డిసెంబర్ లో మొత్తం మార్కెట్ షేర్ లో 20.8 శాతంతో యాపిల్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తర్వాతి స్థానంలో 16.2 శాతంతో సామ్ సంగ్ ఉంది. షియోమీ, ఒప్పో, హువావీ తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.

చివరి త్రైమాసికంలో 5జీ స్మార్ట్ ఫోన్లు, తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి ఫోన్ల అమ్మకాలు కాస్త పెరగడంతో ఓవరాల్ గా మార్కెట్ విలువను కాస్త తగ్గించినట్లు గార్ట్ నర్ తెలిపింది. గత యేడాది కరోనా కారణంగా ప్రజలు అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆ సంస్థ అంచనా వేసింది.

అంతర్జాయంగానే కాకుండా ఇండియాలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ విలువ పడిపోయింది. 2009 తర్వాత తొలిసారి 2020లో ఇండియాలో స్మార్ట్ ఫోన్ల షిప్మెంట్లు 2 శాతం తగ్గినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేసన్ వెల్లడించింది. 2020లో ఇండియాలో మొత్తం 15 కోట్ల స్మార్ట్ ఫోన్లు షిప్ అయినట్లు తెలిపింది.