గెలిచిన సారంగదరియా కోమలి

హైదరాబాద్ : నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ సారంగదరియా ‘ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. కొద్ది గంటల్లోనే ఈ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. పవన్ అందించిన స్వరాలకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, మంగ్లి పాడారు. ఈ జానపద గీతాన్ని ఓ మ్యూజిక్ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినే తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదంటూ కోమలి అనే జానపద గాయని ఆరోపించారు. దీంతో ఈ పాటపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రచయిత సుద్దాల అశోక్ తేజ వివిధ వేదికలపై స్పందించారు. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం ఈ పాటపై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చారు. తన ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

ads

” చాలా ఏ‌ళ్ల కిందట ‘రేలా రే రేలా ‘ ప్రోగ్రామ్ లో శిరీషా అనే యువతి ‘సారంగ దరియా ‘ పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండిపోయింది. ఆ పాట నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా ఈ పాట నా మదిలో తిరుగుతూనే ఉంది. నా మొదటి చిత్రం ‘ డాలర్ డ్రీమ్ ‘లో లక్కీ అలీ పాట ఉంటుంది. ఆ పాటని సినిమాలో వాడినందుకు సోనీ కంపెనీకి కొంత మొత్తం చెల్లించా. వారికి క్రెడిట్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్ ‘లో లక్కీ ఆలీతో పాడించుకున్నా. ‘ఆనంద్ ‘ లో సుబ్బలక్ష్మి పాట నుంచి ‘ఫిదా’లో అప్పగింతల పాట వరకూ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఒక్కో సినిమాకి ఒక్కో పాట మదిలో మెదులుతూ ఉంటుంది. ‘లవ్ స్టోరీ’ కి కూడా నా మనసులో ఈ పాట ఉంది. అందుకే సుద్దాల గారిని కలిశా. ఈ పాటని సినిమాకు అనుకూలంగా రాయాలంటే.. ఈ పాట పల్లవి తీసుకుని, చరణాలు రాశారు. ఆ సాహిత్యం చూసి చాలా ఆనందించా.”

“నా టీంలోని సహాయ దర్శకుడు ఒకరు శిరీష ఫోన్ నంబర్ సంపాదించి ఆమెతో మాట్లాడారు. ఆమె అప్పటికీ గర్భిణీ కావడం.. డెవివరీ టైం దగ్గర పడటంతో ఆ చర్చలు అక్కడితో ఆపేశాం. కరోనా వల్ల సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. తిరిగి షూటింగ్ మొదలైన తర్వాత చంటి బిడ్డతో ఉన్న శిరీషను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఈ పాటను నవంబర్‎లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్ తోనే . ఫిబ్రవరి చివరిలో మంగ్లీతో పాడించాం. ప్రోమో విడుదలయ్యాక సుద్దాల గారు ఫోన్ చేసి , ‘ఆ ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి’ అంటున్నారని తెలిపారు. వారి నంబర్లు కూడా ఇచ్చారు. మా టీం వారితో మాట్లాడింది. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్లాను.”

“ఈ లోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కోమలి ఆ పాటని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమెతో పాడిద్దాం’ అని అన్నారు. నా ముందే ఆమెకు ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తామని ప్రకటించాం కాబట్టి, కోమలిని వెంటనే రమ్మని కోరాను. వరంగల్ నుంచి రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పా. సంగీత దర్శకుడిని చెన్నై నుంచి హైదరాబాద్ కు రమ్మన్నాం. ‘జలుబుగా ఉంది, రాలేను’ అని కోమలి చెప్పారు. మరోవైపు పాట విడుదల చేస్తామని ప్రకటించడంతో కాస్త ఇబ్బంది పడ్డాం. తన పేరు కూడా వేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని కోమలి చెప్పారు. ‘ క్రెడిట్ తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారి సూచించారు. ఇదే విషయాన్ని కోమలిని అడిగితే ‘ మీ ఇష్టం సర్…ఎంత ఇస్తే అంత ఇవ్వండి’ అని ఆమె తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పాడమని ఆమెను అడిగాను. దీనికి కోమలి కూడా ఒప్పుకున్నారు. పాట రిలీజ్ చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పా. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలికి మేం తప్పకుండా క్రెడిట్ ఇస్తాం..తగిన మొత్తం కూడా ఇస్తాం..ఆడియో విడుదల వేడుకకు తప్పక ఆహ్వానిస్తాం” అని శేఖర్ కమ్ముల అభిమానులతో పంచుకున్నారు.