శశికళ డిశ్చార్జ్..పూర్తైన శిక్షాకాలం

బెంగళూరు : ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ ఆదివారం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆమె ఇటీవల జ్వరంతో బాధపడుతూ కరోనా బారిన పడిన శశికళ బెంగుళరు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. శశికళకు పదిరోజుల చికిత్స పూర్తయిందని బెంగళూరు వైద్య కళాశాల హాస్పిటల్ వైద్య బృందంహెల్త్ బులిటెన్‎లో తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, మూడు రోజులుగా ఆక్సీజన్ లేకుండా శ్వాస తీసుకోగల్గుతున్నారని చెప్పింది.

వచ్చే నెల 8వ తేదీన శశికళ తిరిగి చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అవినీతి అక్రమాస్తుల కేసులో బెంగళూరులో అపరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ యేడాది జనవరి 27తో శిక్ష కాలాన్ని పూర్తిచేసుకోనుండగా, ఈనెల 21న అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో ఉండగానే శిక్షాకాలం పూర్తికావడంతో శశికళను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

శశికళ డిశ్చార్జి అవుతారన్న సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు హాస్పిటల్ వద్దకు తరలివచ్చారు. అయితే తమిళనాడులో ఆమె జైలు నుంచి విడుదల కావడం ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శశికళ తీసుకోబోయే నిర్ణయంపై అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.