ఫారెస్ట్ అధికారులపై మంత్రి సత్యవతి ఫైర్

ads

హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు రిజర్వ్ ఫారెస్టు సిబ్బందిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు. మన్ననూరు రిజర్వ్ ఫారెస్ట్‎లో ఇప్పపూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన, ఆదివాసీలపై ఫారెస్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో దాదాపు పది మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఫారెస్ట్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. వెంటనే గాయాలపాలైన వారిని హాస్పిటల్ కు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ అధికారులు అత్యుత్సాహం చూపితే మంచిది కాదని , సంయమనం పాటించి ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వ్యవహరించాలన్నారు.