దేశం గర్వించేలా సచివాలయం నిలవాలి

హైదరాబాద్​ : దేశం గర్వించేలా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిల్వాలని సీఎం కేసీఆర్​ సూచించారు. గురువారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలన్నారు. పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలన్నారు. సచివాలయ నిర్మాణంలో, సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం కేసీఆర్​ పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న ఫిల్లర్లను, బీమ్ ల నాణ్యతను, పనితీరును సీఎం తెలుసుకున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి సీఎం కేసీఆర్​ పలు సూచనలు చేశారు.

ads

‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే అభివృద్ది సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. ఉద్యోగులకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సమీపంలో వున్న మాదిరి ధోల్ పూర్ స్టోన్ తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’అని సీఎం కేసీఆర్​ అధికారులు, వర్క్ ఏజెన్సీకి దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.