జైలు నుంచి విడుదలైన శశికళ

చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళ అరెస్ట్ అయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళకు నేటితో శిక్ష పూర్తి అయ్యింది. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో జనవరి 20 నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పరస్పర అగ్రహార జైలు అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు.

జయలలిత చనిపోయిన సమయంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ప్రయత్నాలు చేశారు. కానీ అక్రమాస్తుల కేసుల్లో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పార్టీని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్ సెల్వం నడిపిస్తున్నారు. 2021 ఎన్నికల్లో సీఎ అభ్యర్థి పళనిస్వామి అని పనీర్ సెల్వం ప్రకటించారు. అదే రోజు శశికళకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం.

ఇక కరోనా బారినపడిన శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. మరో నాలుగైదు రోజుల్లో శశికళను డిశ్చార్జి చేయనున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు.