మహిళల భద్రతే లక్ష్యం కావాలి

వరంగల్​ అర్బన్​ జిల్లా : మహిళలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా షీం టీంలు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పీ ప్రమోదకుమార్ అన్నారు. ఆకతాయిల పనిపట్టే విధంగా షీ టీం సిబ్బంది విధులు నిర్వహించాల్సిందిగా సీపీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో షీ టీంలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం బృందాలకు మంజూరు చేసిన నూతన ద్విచక్ర వాహనాలను బుధవారం సీపీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఆవిర్భవించిన షీ టీం లపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీపీ తెలిపారు. మహిళలను వేధించే ఆకతాయిలను కట్టడి చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం బృందాలు చక్కటి ఫలితాలను అందిస్తున్నాయని సీపీ ప్రమోద్​కుమార్​ కొనియాడారు. రెండేళ్ల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న 43మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు, 290 పిటీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 280 మంది ఆకతాయిలను వారి కుటుంబ సభ్యుల అధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సీపీ ప్రమోద్​కుమార్​ చెప్పారు. రానున్న రోజుల్లో ఆకతాయిల రహిత నగరమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీంలు పనిచేయాలని సూచించారు. అలాగే సిబ్బందికి అందించిన నూతన వాహనాలను వ్యక్తిగత శ్రద్ధతో పరిరక్షించుకోవాలి’అని సీపీ ప్రమోద్​కుమార్ సూచించారు.