వివాదంలో శిఖర్ ధావన్

వారణాసి : నిబంధనలు ఉల్లంఘించి పక్షులకు ఆహారం వేసిన టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వివాదంలో చిక్కుకున్నాడు. మార్గదర్శకాలు పాటించకుండా, పడవలోకి పర్యాటకులను అనుమతించిన బోటు యజమానిపై చర్యలు తీసుకుంటామని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం ) కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ధావన్ పడవలో విహరిస్తూ పక్షులకు ఆహారం వేయడం వివాదాస్పదమైంది.

దీంతో మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని తన ఇన్ స్టాగ్రామ్ లో ట్వీట్ చేసిన ధావన్ దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.