ప్రముఖ గాయకుడు జై శ్రీనివాస్ మృతి

హైదరాబాద్ : కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపుతోంది. ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు చిత్రసీమలో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న నేరడికొమ్మ శ్రీనివాస్ ( జై శ్రీనివాస్ ) మరణించారు. కరోనాతో సోకి ఆస్పత్రిపాలైన జై శ్రీనివాస్ ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎంతగానో ఎదురుచూశారు. అప్పటికే వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. దాదాపు 11 లక్షల వరకు ఖర్చు పెట్టిన జై శ్రీనివాస్ , ఆ తర్వా దాతల కోసం ఎదురుచూశారు. కానీ చివరకు కరోనా అతడి ప్రాణాలను తీసుకుంది. పరిస్థితి తీవ్రతరం కావడంతో శ్రీనివాస్ కన్నుమూశారు.

ads

దేశభక్తి పాటలతో శ్రీనివాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. జై సినిమాలోని దేశం మనదే తేజం మనదే అనే పాటతో ఫేమస్ అయ్యారు. అలా అప్పటి నుంచి జై శ్రీనివాస్ గా మారిపోయారు. రాజారాని, వీధి ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు. కరోనాతో బాధపడుతున్న సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని సింగర్స్ అందరూ ముందుకు వచ్చారు. చేతనైన సాయం చేశారు. మంగ్లీ, మనీషా ఎర్రబత్తిని, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్, హారికా నారాయణ్ ఇలా ఎంతో మంది ముందుకు వచ్చారు. కానీ వారు చేసిన సాయం ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాను.

ఇక జై శ్రీనివాస్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, సహచర గాయనీగాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.