కేసీఆర్ బర్త్‎డేకు ఘనమైన ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జన్మదిన వేడుకలకు వేదిక అయిన జలవిహార్‎లో సీఎం కేసీ‎ఆర్ జీవిత చరిత్రను వివరించేలా త్రీ డీ గ్రాఫిక్స్‎లో రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్‎ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్‎తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జలవిహార్‎లో నిర్వహించే జన్మదిన వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా 30 నిమిషాల వ్యవధి కలిగిన త్రీ డీ డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను ఎల్‎సీడీ స్క్రీన్‎ల‎పై ప్రదర్శించనున్నట్లు మంత్రి చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ కు దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎమ్మెల్సీ కవితతో కలిసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, సికింద్రాబాద్‎లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వీటితో పాటు మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసానిపేర్కొన్నారు. పార్సీగుట్టలోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి బంగారు కవచం అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆద్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఇవే కాకుండా నాంపల్లిలోని యూసెఫిన్ దర్గాలో చాదర్ సమర్పించడం, గురుద్వార్‎లో గురుగ్రంథ్ సాహెబ్‎కు గురుద్వారా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, గాంధీ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జల విహార్ లో నిర్వహించే సీఎం జన్మదిన వేడుకలలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేటి విద్యా సాగర్, మంత్రులు మహామూద్ అలీ, మల్లారెడ్డి, పలువురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు చైర్మన్ లు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొంటారని తెలిపారు.