సీఏపీఎఫ్ కు ప్రత్యేక ఆరోగ్య పథకం

గువహతి : సాహసవంతులైన కేంద్ర సాయుధ పోలీసు దళాలు, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం కొత్త పథకం ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ ఈ రోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్ ) కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అసోంలోని గువహతిలో శనివారం జరిగిన సీఏపీఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ పథకాన్ని ఆవిష్కరించారు.

ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఈ రోజు కంటే మరో మంచి రోజు లేదన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 24వేల ఆసుపత్రుల్లో సుమారు 10 లక్షల మంది సీఏపీఎఫ్ జవాన్లు, అధికారులు, సుమారు 50 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు వైద్య ప్రయోజనాలను పొందుతారని తెలిపారు. మే1 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు ఈ ఆరోగ్య పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని చెప్పారు.