కళాకారులకు పురస్కారాలు

వరంగల్ అర్బన్ జిల్లా: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కళలు, భాష, సాహిత్యం, సంస్కృతిలకు పూర్వ వైభవం కల్గుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కళలను పోషిస్తూ, తగిన గుర్తింపుని తెస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని పోతన కళా భవనంలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి 36వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రదర్శనలు చేసిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందచేశారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతిక, సాహిత్య పరంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలుపడానికి కృత నిశ్చయంతో వున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో మరుగున పడిన కళలనన్నింటినీ రాష్ట్రం సిద్ధించాక అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పురస్కారాలు అందుకున్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాంతి కృష్ణ సమితి సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.