‘మాత్రా’ , ‘సర్వమంగళా’ అలంకరణల్లో శ్రీ భద్రకాళి

వరంగల్ అర్బన్ : శ్రీ భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు గురువారానికి 13వ రోజుకు చేరుకున్నాయి. గురువారం తెల్లవారుజామున నిత్యాహ్నితం పూర్తిచేసిన తర్వాత అమ్మవారి ఉత్సవ మూర్తుల్లోని ఇచ్ఛాశక్తిని మాత్రా నిత్యగాను, అమ్మవారి జ్ఞానశక్తిని షోడశీ క్రమాన్ననుసరించి సర్వమంగళా నిత్యగాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. పంచభూతముల యందు పంచతన్మాత్రలు అనగా శబ్ధ, స్వర్శ, రూప, రస, గంధ రూపంలో ఉన్నవి ఈ జగన్మాత విభూతులే.

ads

అందుకే ఆమెను శాస్త్రములు మాత్రా అని కీర్తించాయి. సర్వమంగళాదేవి ప్రారబ్ధవశమున కొట్టుమిట్టాడుతున్న జీవులకు అమంగళములను తొలగించి శుభమంగళములను ప్రాప్తింపచేస్తుందని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. మానవుని శరీరంలో అటు జాతకరీత్యా కాని ఆరోగ్యపరంగా గాని ఏమైనా రుగ్మతులు ఉంటే మాత్రా క్రమంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే తొలగుతాయని, సకల సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భద్రకాళి శేషు తెలిపారు.

నేటి కార్యక్రమాలకు వరంగల్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త బాకరాజు చంద్రశేఖర్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజానంతరం వారికి ఆలయ అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు.