అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఈటల

హైదరాబాద్​ : పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయని తెలిపారు. కరోనా విషయంలో తెలంగాణ సేఫ్ గా ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీతో మంత్రి ఈటల రాజేందర్ రివ్యూ సమావేశం నిర్వహించారు.

ads

కేసులు పెరిగినా కూడా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఈ సమావేశంలో  నిర్ణయం తీసుకున్నారు. టిమ్స్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో, గాంధీ హాస్పిటల్ కొవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. పీపీఈ కిట్స్, N- 95 మాస్క్ లు,  మందులు , రేమెడ్స్విర్  ఇంజక్షన్లు, యాంటీ వైరల్ టాబ్లెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో రోజుకు 50 వేల కరోనా నిర్ధారణ  పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. వీటి సంఖ్య మరింత  పెంచడంతోపాటు ఆర్టీపీసీఆర్​ పరీక్షలు ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం తోనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. కరోనా పట్ల నిర్లక్షం గా వ్యవహరించొద్దని సూచించారు. మాస్క్​లు తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మంత్రి ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.