ధ్వజస్తంభం పునరుద్ధరణకు చర్యలు


నల్లగొండ జిల్లా : పెద్దగట్టు జాతర ప్రాంగణంలో కూలిన ధ్వజస్తంభం పునరుద్ధరణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్వపరాలను పరిశీలించిన మీదట తూర్పు భాగంలో ధ్వజస్తంభాన్ని తొలుత ప్రతిష్ఠించిన వంశస్థులతో మంత్రి జగదీష్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా తక్షణం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డిని మంత్రి జగదీశ్​రెడ్డి ఆదేశించారు.

ads

మంత్రి ఆదేశానుసారం యాదవుల సాంప్రదాయానికి అనుగుణంగా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పెద్దగట్టు జాతర ను రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిచ్చి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి జాతర ప్రాశస్త్యాన్ని వివరించి కోట్ల నిధులు విడుదల చేయించిన విషయం విదితమే. ఈ క్రమంలో మరికొద్ది సేపట్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ధ్వజస్తంభం పక్కకు తొలగడంతో ఆఘమేఘాల మీద అక్కడికి మంత్రి జగదీష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. జాతర ప్రాభవాన్ని ఏ మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు రంగంలోకి దిగిన అధికారుల బృందం ధ్వజస్తంభం పునరుద్ధరణ కు ఉపక్రమించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, డీసీయంయస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్ , మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.