రేపటి నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.

ads

అదేవిధంగా 1 నుంచి 9 వరకు చదువుతున్న 53లక్షల 79వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్కూల్స్, జూనియర్ కాలేజీలను తర్వాత ఎప్పుడు తెరిచేది కొవిడ్ -19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 26న ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.