ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆపత్కాలంలో ఆసరా


హైదరాబాద్ : ప్రైవేట్ స్కూల్స్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేల నగదు సాయం, 25కిలోల సన్నబియ్యం పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకుంటున్నదని సంతోషపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ , బాలాపూర్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కరీంనగర్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

ads

రాష్ట్రంలో 1,25,302 మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది ఉండగా ఇప్పటివరకు 2వేల చొప్పున 1,12,843 మంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమచేశామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సన్నబియ్యం లబ్ధిదారులు 1,13,600 మంది ఉండగా, రూ. 10.75 కోట్ల వ్యయంతో 2,840 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

బ్యాంక్ ఐఎఫ్ ఎస్ సీ కోడ్ ను తప్పుగా నమోదుచేయడంతో కొంతమంది ఖాతాల్లో రూ.2వేలు జమకాలేదని, గురువారంలోగా వీరందరికీ జమచేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది రేషన్ షాపు నంబర్లను పొరపాటుగా పేర్కొనడం వల్ల బియ్యం అందనివారికి, రెండ్రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేవరకు ప్రతీ నెలా ఈ సాయం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి విద్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ 25 కిలోల సన్నబియ్యం పంపిణఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశ హాలులో బియ్యం , రూ.2వేలను పంపిణీ చేశారు.