న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో ఊరట లభించింది. విదేశాల్లో ప్రయాణించేందుకు కార్తీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆయన కోర్టులో రెండు కోట్ల నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ షరతుతో కూడిన ఆదేశాలను ఇచ్చింది. ఆరు నెలల పాటు ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించారు. ఈ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారో అన్ని వివరాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఇస్తే, అప్పుడు ఆయన పది కోట్లు డిపాజిట్ చేయాలని అడ్వకేట్ ఏఎస్జీ రాజు కోర్టు ముందు వాదించారు.
అయితే కార్తీ తరపున వాదించిన కపిల్ సిబల్.. ఆ పెద్ద మొత్తం ఎందుకని ప్రశ్నించారు. కారీ ఓ ఎంపీ అని, ఆయన ఎక్కడికీ వెళ్లరని, అంత భారీ అమౌంట్ డిపాజిట్ చేయడం సరికాదన్నారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ భూషణ్.. కార్తీపై డిపాజిట్ అమౌంట్ను తగ్గిద్దామని అన్నారు. ఎయిర్సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎస్ మీడియా కేసుల్లో కార్తీపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్లో కార్తీ అభ్యర్థించారు.