ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నంటినీ కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హ్రుషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.