కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారించింది. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.25వేల కోట్ల స్కామ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆత్రం సుగుణ ఊట్నూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయింది.

ఉట్నూర్ పీఎస్ లో తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ గతంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.