పాడి రైతులకు శుభవార్త

హైదరాబాద్​ : పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయ డెయిరీ తో పాటు కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీ లలో సభ్యులుగా ఉన్న లబ్దిదారులు అందరికీ త్వరలోనే పాడిగేదెల ను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాద్​ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ బోర్డ్ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి, అధ్యక్షతన జరిగింది.

‘పాడి రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ప్రభుత్వం సబ్సిడీ పై పాడిగేదెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా విజయ డెయిరీ తో పాటు కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలు పోసే రైతులకు పాడి గేదెలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కరోనా మహమ్మారి, ఇతర కారణాలతో పాడిగేదెల పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయిందని మంత్రి తెలిపారు. సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్దిదారులు డీడీలు చెల్లించారని, వీలైనంత త్వరగా వారికి పాడి గేదెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.

విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీ గా పాడి గేదెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని వివరించారు. సబ్సిడీ పై అందజేసిన పాడిగేదెలకు కొనుగోలు సమయంలోనే ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తలసాని గుర్తు చేశారు. పంపిణీ చేసిన గేదెల లో 2,691 చనిపోయాయని, వాటికి సంబంధించి క్లెయిమ్ కింద గేదెలను పంపిణీ చేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను తలసాని ఆదేశించారు. పాడి రైతులను ప్రోత్సహించే ఆలోచనతో లీటర్ పాలకు 4 రూపాయలు చొప్పున ప్రోత్సాహాకాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కాగా ఇకనుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ. 3 ఆయా డెయిరీ సంస్థలు 1 రూపాయి కలిపి రైతులకు చెల్లించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ఈ మేరకు కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీ లకు పాలు పోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహ బకాయిలు రూ. 8 కోట్లను విడుదల చేస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. మిగిలిన బకాయిలను కూడా వీలైనంత త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఉచితంగా జీవాలకు వైద్య సేవలు, సబ్సిడీ పై గేదెల పంపిణీ, పాలకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు. అలాగే ఏడాది పాటు పాలు కొనుగోలు చేస్తున్నా ఈ సంస్థలకే పాలు విక్రయించి అభివృద్దికి తోడ్పాటును అందించాలని మంత్రి కోరారు. ప్రైవేటు డెయిరీల నిర్వహకులు కేవలం సీజన్ లో మాత్రమే పాలు కొనుగోలు చేస్తారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సంస్థలు అభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తలసాని వివరించారు.
విజయ ఐస్ క్రీం కు ప్రజల నుంచి బాగా డిమాండ్ వస్తుందని అన్నారు. ఈ వేసవి నాటికి విజయ ఐస్ క్రీం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ శ్రీనివాసరావు ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

విజయ ఐస్ క్రీం ల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ ( సైకిల్ రిక్షా) లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ముందుగా 250 పుష్ కార్ట్ ల ద్వారా ఐస్ క్రీం ల విక్రయాలు ప్రారంభించాలని, రానున్న రోజుల్లో మరిన్ని తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తద్వారా అనేకమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు , కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి రద్దీ ఉండే ప్రాంతాలను గుర్తించి పుష్ కార్ట్ ల ద్వారా ఐస్ క్రీం ల విక్రయాలు చేపట్టాలని అన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు కోసం హెచ్​ఎండీఏ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. నూతన ఔట్ లెట్ లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చి నెలలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి’మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఆదేశించారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ లు పాల్గొన్నారు.