18న టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన

అమరావతి: విశాఖ‍ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేట్‎పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 18న టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. కేసుల మాఫీ కోసమే జగన్ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోస్కోతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, స్టీల్ ప్లాంట్ మిగులు భూమిని కాజేసేందుకు కేంద్రం ఎదుట మోకరిల్లారని అన్నారు. స్టీల్ ప్లాంట్‎ను నిర్వీర్యం చేయాలని చూస్తున్న వైసీపీ సర్కార్ కుట్రలను తెలుగు ప్రజలు ఉక్కు సంకల్పంతో ఎదుర్కోవాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

తెలుగు ప్రజల ముందు జగన్ కుట్రలు సాగవని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాయి.