మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీక నర్సులు

వరంగల్ అర్బన్ జిల్లా : మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు రూపం, సేవకు, మానవత్వానికి ప్రతీకగా నర్సులు నిలుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. అనారోగ్యంతో ఉన్న బాధితుల పాలిట ఆత్మ బంధువులుగా తమ సేవలను అందిస్తూ, కరోనా కష్టకాలంలోనూ బాధితులకు సేవలందిస్తున్న నర్సులకు ప్రభుత్వ చీఫ్ విప్ కృతజ్ఞతలు తెలిపారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులకు, వైద్య సిబ్బందికి దాస్యం వినయ్ భాస్కర్ పండ్లు పంపిణీ చేశారు.

ads

ఈకార్యక్రమంలో భాగంగా నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధంలో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆరించి, సేవలందించిన Lady with the lamp ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచవ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో వైద్యులు, నర్సుల సేవలను ఆయన కొనియాడారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోజుల కొద్దీ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టేందుకు కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారని అన్నారు. కంటికి కనిపించని వైరస్ తో యుద్ధం చేస్తూ, కరోనా పేషంట్లకు సేవ చేస్తున్న నర్సులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ & కూడా డైరెక్టర్ రవీందర్ రెడ్డి , ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమా సరళా దేవి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.