దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు

25 నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని కొప్పులపేర్కొన్నారు.

‘ఈ మేరకు రూ. 20 కోట్ల 41 లక్షల రూపాయల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్​చైర్స్​, ల్యాప్​టాప్స్​, 4జీ స్మార్ట్​ ఫోన్స్​, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్​ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 90వేల రూపాయల విలువ చేసే900 రిట్రోఫెట్టెడ్​ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామని వివరించారు. ఉపకరణాల కోసం ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవలసిందిగా మంత్రి సూచించారు. www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని’ మంత్రి కొప్పుల ఈశ్వర్​ వెల్లడించారు.