హత్యను సుమోటాగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: పెద్దపల్లిలో జరిగిన జంట హత్య కేసును హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. న్యాయవాదులైన గట్టు వామన్ రావు, పీవీ నాగమణి దంపతుల హత్య కేసును ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పకడ్భంధీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్‎ను హైకోర్టు ఆదేశించింది. ఈ యేడాది మార్చి 1వ తేదీ లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించిన హైకోర్టు, ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. హత్య జరిగిన చోట అన్ని ఆధారాలను సేకరించి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపాలని ఆదేశించింది. హత్య జరిగిన సమయంలో అక్కడున్న ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తించి , వాళ్లను సాక్షులుగా చేర్చాలని కోర్టు తెలిపింది. హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, వాటిని భద్రపరచాలని సూచించింది. తర్వాత విచారణను మార్చి1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

న్యాయవాదులైన వామన్ రావు, నాగమణి హత్య జరిగిన వెంటనే పోలీసుశాఖ అప్రమత్తమైందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. హంతకులను అతి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన కోర్టుకు చెప్పారు. ఇక న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యతో షాక్ కు గురయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు.