నేటి నుంచి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు

వరంగల్ అర్బన్ జిల్లా : వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో రూ.150 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో రేప‌టి నుంచి వైద్య సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని కేఎంసి ప్రాంగణంలో ఉన్న సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిని గురువారం మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి అక్క‌డి స‌దుపాయాల‌ను ప‌రిశీలించారు. ఎంజీఎం ఆసుప‌త్రిని ప్ర‌త్యేకంగా కొవిడ్ చికిత్స కోసం వినియోగిస్తున్నందున కేఎంసి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిని ప్ర‌స్తుతం జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిగా మార్చుతున్న‌ట్లు తెలిపారు. జ‌న‌ర‌ల్ వైద్యం కోసం అత్య‌వ‌స‌రంగా ఒక వార్డును ప్రారంభిస్తున్నామ‌ని, వారంలోగా పూర్తి స్థాయి ఆసుప‌త్రిగా మారుస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఆసుప‌త్రికి వచ్చే రోగుల‌కు చికిత్స అందించ‌డానికి ఖాళీగా ఉన్న‌ డాక్ట‌ర్లు, పారామెడికల్‌ సిబ్బందిని నియ‌మిస్తున్నామని ఆయ‌న తెలిపారు.

ads

కేఎంసీలో రూ.150 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేస్తున్న సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రిలో సివిల్ వ‌ర్క్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ప్లంబింగ్‌, అగ్నిమాప‌క నిరోధ‌క ప‌రిక‌రాల ప‌నులు పూర్త‌య్యాయని చెప్పారు. ఆసుప‌త్రిలో నిరంత‌రంగా నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ద‌న్నారు. ఐసియు మానిట‌రింగ్ పూర్తి అయ్యింద‌ని తెలిపారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌, సిటి స్కాన్‌, ఎక్స్ రే సిస్ట‌మ్‌, ల్యాబ్‌, అల్ట్రా సౌండ్ కంప్యూట‌ర్‌, మెడిక‌ల్ ఫ‌ర్నీచ‌ర్ ప‌నులు పూరై, డ‌యాల‌సిస్ యూనిట్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

ఎంజీఎం ఆసుప‌త్రిలో మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని, ఆందువ‌ల్ల ప్ర‌తీ కొవిడ్ బాధితులు చికిత్స కోసం యంజియంలో చేరాల‌ని ఆయ‌న కోరారు. కోవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను ఆశ్ర‌యించి, ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం 440 ఆక్సిజ‌న్ బెడ్స్, 80 ఐసియు బెడ్స్‌, వెంటిలెటర్స్‌తో కూడిన 50 ఐసియు బెడ్స్‌, 200 ఆక్సిజ‌న్ బ‌ల్క్ సిలెండ‌ర్లు, 100 బి టైప్ ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, 10 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజ‌న్ ట్యాంక్ కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆందుబాటులోఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. అంతె కాకుండా 13 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజ‌న్ ట్యాంక్ ప్రారంభోత్స‌వానికి సిద్దంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ఎంజీఎంలో కొవిడ్ బాధితుల‌కు అందుతున్న చికిత్స గురించి ప్ర‌తిరోజు సీఎం కేసిఆర్, కేటిఆర్ లు సమీక్ష చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ఎంజీఎం ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ నాగార్జున రెడ్డి, కేఎంసి ప్రిన్సిపాల్ సంధ్యారాణి, త‌దిత‌ర సిబ్బంది ఉన్నారు.